సామాజిక దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలేతో పాటు ఇతర బీసీ మహనీయుల విగ్రహాలను మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడానికి తగిన స్థలాలను కేటాయించాలని బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు వారు మంచిర్యాల మేయర్‌కు వినతిపత్రం సమర్పించారు.
మహాత్మ జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, సామాజిక అసమానతలపై పోరాటానికి చేసిన కృషిని శ్రీనివాస్ గుర్తుచేశారు. విద్య ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆయన 10వ శతాబ్దంలోనే గుర్తించారని, బాలికా విద్యకు పునాదులు వేశారని తెలిపారు.
గతంలో పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా విగ్రహాల ఏర్పాటుపై స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో విగ్రహాల ఏర్పాటుతో భావితరాలకు పూలే చరిత్ర తెలుస్తుందని ఆయన అన్నారు.
బీసీ మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు వీలు కల్పించాలని, విగ్రహాల ఏర్పాటు ప్రయత్నాలను సఫలం చేయాలని మేయర్‌ను కోరారు.








