మందమర్రి ఓర్రగడ్డలో నివసిస్తున్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శోభా దేవి కుటుంబానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
వృద్ధాప్యంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబ పరిస్థితిని గమనించిన స్థానికులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించగా, సమాచారం అందిన వెంటనే స్పందించిన సొసైటీ, ఈరోజు ఆ కుటుంబానికి అవసరమైన నిత్యావసర సరుకులను అందజేసింది. ఈ కార్యక్రమం రామటేంకి ఆపిల్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మరియు ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్ మాట్లాడుతూ, గతంలో కూడా ఈ కుటుంబానికి సొసైటీ తరఫున సహాయం అందించబడిందని, భవిష్యత్తులో కూడా తమ సొసైటీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ఝాన్సీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల్ జిల్లా అధ్యక్షుడు నాది పాట రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, ఎండి జావిద్ పాషా, శ్రీనివాస్, కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ నిరంతరం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటుందని తెలిపారు.












