మందమర్రి పట్టణంలో గుడుంబా తయారీ, అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా, కేసులు నమోదు చేసినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దొరల బంగ్లా, మార్కెట్, వెంకటేశ్వర ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి.
పట్టణంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలు బహిరంగంగానే జరుగుతున్నాయని, దీనివల్ల యువత చెడు వ్యసనాలకు బానిసైతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా నష్టాన్ని కలిగిస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
ఎక్సైజ్ పోలీసులు ఈ అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గుడుంబా తయారీ కేంద్రాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేయాలని, అమ్మకందారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వ యంత్రాంగం ఈ సమస్యపై తక్షణమే దృష్టి సారించి, ప్రజలకు భద్రత కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గుడుంబా బెడదను అరికట్టడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.











