జిల్లా వ్యాప్తంగా వినాయక శోభాయాత్రలు, నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆయన మహబూబ్ సాగర్ చెరువు, సదాశివపేట ఊబ చెరువులను సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సూచించారు. గణేష్ శోభాయాత్రలు జరిగే మార్గాల్లో రోడ్ల పరిస్థితి, అవసరమైన మరమ్మతులు, నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్, భద్రతా లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్తయ్యగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ కూన సంతోష్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












