సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వినాయక శోభాయాత్రలు, నిమజ్జనాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. శనివారం మండలంలోని దౌల్తాబాద్, బోర్పట్ల గ్రామాల్లో నిమజ్జనాలు జరిగే చెరువులను ఆయన సందర్శించి, అధికారులతో సమీక్షించారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం మండలంలోని దౌల్తాబాద్, బోర్పట్ల గ్రామాల్లో వినాయక నిమజ్జనాలు నిర్వహించనున్న చెరువులను సందర్శించి, అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. చెరువుల వద్ద తగినంత లైటింగ్, క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. గణేష్ శోభాయాత్రలు జరిగే మార్గాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన మరమ్మతులను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా చెరువుల వద్ద బారికేడింగ్, భద్రతా లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిమజ్జన కార్యక్రమాలకు వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఎస్పీ సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ సమీక్షా కార్యక్రమంలో ఎస్పీ వెంట తహసీల్దార్ ఫర్హీన్ షేక్, జిన్నారం ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.












