సిద్దిపేట, జూలై 16, 2026
మంచిర్యాల జిల్లాలో హెచ్.ఐ.వి (HIV) స్క్రీనింగ్‌ను పటిష్టం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. అంతర్జాతీయ '95-95-99' లక్ష్యాలను సాధించే దిశగా, హెచ్.ఐ.వి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించారు. ఈ మేరకు డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (ఐ.డి.ఓ.సి) లో మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డి.ఎమ్.హెచ్.ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ గారి అధ్యక్షతన 'దిశా' (DISHA) మాస నివేదిక సమీక్షా సమావేశం నిర్వహించబడింది. మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష (MAS) లక్ష్యాలను సమీక్షించడం మరియు హెచ్.ఐ.వి బాధితులకు (PLHIV) మెరుగైన వైద్య సేవలను అందించడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ సమీక్షా సమావేశంలో డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ గారు మాట్లాడుతూ, ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో 2,064 మంది హెచ్.ఐ.వి బాధితులకు ఉచిత యాంటీ-రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య పర్యవేక్షణలో భాగంగా, నమోదైన ఈ 2,064 మంది రోగులందరికీ (98 శాతం) వైరల్ లోడ్ (Viral Load) పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా, అంతర్జాతీయ "మొదటి 95" (వ్యాధి ఉన్న వారిలో 95 శాతం మంది గుర్తింపు) లక్ష్యాన్ని చేరుకోవడానికి, జిల్లాలో ఇంకా నిర్ధారణ కాని మరో 436 కొత్త హెచ్.ఐ.వి పాజిటివ్ కేసులను గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయి సిబ్బంది, వైద్య బృందాలు సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలోని సమస్యాత్మక మరియు గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించారు. తద్వారా బాధితులను త్వరగా గుర్తించి, వారికి తగిన చికిత్స అందించాలని స్పష్టం చేశారు.
జిల్లాలో హెచ్.ఐ.వి (HIV) మరియు సిఫిలిస్ (Syphilis) పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడును. ప్రజలు ఈ క్రింది కేంద్రాలలో ఉచిత సేవలను వినియోగించుకోవచ్చు: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH): ఐ.సి.టి.సి (ICTC) రూమ్ నంబర్ 50 మరియు డి.ఎస్.ఆర్.సి (DSRC) రూమ్ నంబర్ 48. లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి: రూమ్ నంబర్ 5. టోల్ ఫ్రీ నంబర్: మరిన్ని వివరాలు మరియు సహాయం కొరకు 1098 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.
"వ్యాధిని ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు" అని డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ గారు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా హెచ్.ఐ.వి పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ అని తేలితే వెంటనే ఏ.ఆర్.టి (ART) ఉచిత చికిత్సను పొంది మెరుగైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో ఎయిడ్స్ & లెప్రసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, దిశా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఎ. నీలిమ, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, సి.ఎస్.ఓ ఆర్. రాజేష్, ఐ.సి.టి.సి కౌన్సిలర్లు శ్రీనివాస్, ఆంజనేయులు, జగన్ మోహన్, నరేందర్, ల్యాబ్ టెక్నీషియన్ దేవదాస్, స్నేహ ఎన్.జి.ఓ ప్రాజెక్ట్ మేనేజ్ పవన్, జి.ఎన్.ఎమ్ కీరవాణి, లింక్ వర్కర్స్ స్కేమ్ సూపర్వైజర్ శ్రీకాంత్, అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అవుట్‌రీచ్ వర్కర్లు మరియు క్లస్టర్ లింక్ వర్కర్లు పాల్గొన్నారు.












