పటాన్చెరు, 14 November
వన్యప్రాణుల వేటలో పాల్గొన్నా, సహకరించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జన్నారం అటవీ డివిజన్ అధికారి రాంమోహన్ హెచ్చరించారు.
వన్యప్రాణుల వేటకు పాల్పడినా, వేటకు సహకరించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జన్నారం అటవీ డివిజన్ అధికారి రాంమోహన్ హెచ్చరించారు. తాళ్లపేట రేంజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చడం, ఉచ్చులు వేయడం, బల్లెములు, తుపాకులు వంటి ఆయుధాలను ఉపయోగించడం వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం తీవ్రమైన నేరాలని స్పష్టం చేశారు. నేర తీవ్రతను బట్టి 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
వన్యప్రాణుల వేటకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించడం, ప్రోత్సహించడం, కుట్రలో భాగస్వాములు కావడం కూడా నేరమేనని తెలిపారు. ఫోన్ కాల్స్ లేదా ఇతర సమాచార మార్గాల ద్వారా వేటకు సహకరించినట్లు ఆధారాలు లభిస్తే, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గత ఘటనల స్మరణ
గతంలో జన్నారం అటవీ డివిజన్ పరిధిలో అక్రమ వేట కారణంగా వన్యప్రాణులు మృత్యువాత పడటంతో పాటు, విద్యుత్ తీగల కారణంగా మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు.
ఇటీవల తాళ్లపేట రేంజ్ పరిధిలోని దండేపల్లి సెక్షన్, పాత మామిడిపల్లి బీట్ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం కొందరు వ్యక్తులు విద్యుత్ తీగలు అమర్చినట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ తీగల కారణంగా పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడం బాధాకరమని తెలిపారు. ఈ ఘటనపై పోలీసు శాఖ కూడా భారతీయ న్యాయ సంహిత () ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
రైతులకు సూచనలు
రైతులు తమ పంటలను వన్యప్రాణుల నుంచి రక్షించుకునే ఉద్దేశంతో కూడా పొలాల చుట్టూ విద్యుత్ లైవ్ వైర్లు అమర్చరాదని సూచించారు. ఇలాంటి చర్యలు వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 మరియు విద్యుత్ చట్టం-2003 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అటవీ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, గ్రామాల పరిసరాల్లో అనుమానాస్పద విద్యుత్ తీగలు, ఉచ్చులు లేదా వేటకు సంబంధించిన వస్తువులు కనిపిస్తే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకుండా వెంటనే సమీప అటవీ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






