ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో పొలంలో కనిపించిన సుమారు 100 కిలోల బరువున్న భారీ కొండచిలువను చూసి రైతులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి అది సమీపంలోని ఛోయియా నదిలోకి వెళ్లి అదృశ్యమైంది.
జలాల్పూర్ ఛోయియా గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరకు పొలాల్లో రైతులు పనులు చేసుకుంటుండగా.. గడ్డి మధ్యలో భారీ పాము కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా అది పెద్ద కొండచిలువ అని గుర్తించారు. దాని భారీ ఆకారాన్ని చూసి రైతులు ఆశ్చర్యంతో పాటు భయపడ్డారు. ఈ విషయం తెలియడంతో దాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రాంతీయ అటవీ అధికారి మహేశ్చంద్ర గౌతమ్ ఆదేశాలతో సిబ్బంది అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ముగ్గురు సిబ్బంది కలిసి దాన్ని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారి చేతుల నుంచి తప్పించుకున్న కొండచిలువ సమీపంలోని ఛోయియా నదిలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత నీటిలో కనిపించకుండా అదృశ్యమైంది.
అటవీ అధికారి మహేశ్చంద్ర గౌతమ్ అంచనా ప్రకారం.. ఆ కొండచిలువ బరువు సుమారు ఒక క్వింటాల్ ఉండవచ్చు. జిల్లాలో ఇప్పటివరకు కనిపించిన అతిపెద్ద, ఆరోగ్యవంతమైన కొండచిలువల్లో ఇదొకటని ఆయన పేర్కొన్నారు. గత రెండేళ్లుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రాక్ పైథాన్ జాతికి చెందిన భారీ కొండచిలువలు కనిపిస్తున్నాయని తెలిపారు.
కొండచిలువలు సాధారణంగా మనుషులపై దాడి చేయడానికి ప్రయత్నించవని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలు, పొదలు, నీటి వనరుల సమీపంలో ఇవి ఆశ్రయం పొందుతాయని వివరించారు.
ఇలాంటి భారీ పాములు కనిపించినప్పుడు వాటిని పట్టుకోవడానికి లేదా దగ్గరకు వెళ్లి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవద్దని, వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు.












