జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథుని శోభాయాత్రను కన్నుల పండువగా నిర్వహించి, భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ దంపతులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు.
అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా ఎస్పీ దంపతులు గణనాథుని శోభాయాత్రను ప్రారంభించారు. ఈ శోభాయాత్రలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డితో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి, క్రమశిక్షణ, ఐక్యతతో గణనాథుని శోభాయాత్రను నిర్వహించి, నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశామని ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గణనాథుని శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పోలీసుశాఖకు ప్రజలు, నిర్వాహకులు సహకరించాలని ఆయన కోరారు.












