హజీపూర్, 2026-11-14
ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో 2026 యాసంగి పంటల సాగుపై వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది.
ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో 2026 యాసంగి పంటల సాగుపై వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. రానున్న రోజుల్లో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరమయ్యే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ సూచించారు.
హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదికలో శనివారం నిర్వహించిన ప్రత్యేక రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఎల్ నినో పరిస్థితులు, 2026 యాసంగి పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణపై వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలుగా పెసర, మినుము, శనగ వంటి పప్పు ధాన్యాలు, జొన్న, మొక్కజొన్న వంటి ఆహార పంటలు సాగు చేయాలని సూచించారు. అలాగే కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వులు, వేరుశనగ వంటి నూనె గింజల పంటలతో పాటు వివిధ రకాల కూరగాయల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.
తక్కువ నీటితో పంటలు సాగు చేయడం, పంటల వైవిధ్యీకరణ పాటించడం ద్వారా నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు ముందస్తుగానే పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు మామిడి కృష్ణ, సస్యరక్షణ సహాయ వ్యవసాయ సంచాలకులు గోపి, డివిజన్ వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
మంచిర్యాల (అక్షరవేకువ): ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నీటి పొదుపు సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.






