సమాజ హక్కుల సాధన కోసం గొల్ల–కుర్మలు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెళ్లి చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. శనివారం జైపూర్ మండల కేంద్రంలో తెలంగాణ గొల్ల–కుర్మా దొల్ దెబ్బ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ సమ్మేళనంలో గొల్ల–కుర్మా సంఘాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ బినవేణి రాము మాట్లాడుతూ, సమాజ ఐక్యత, అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, విద్యా సాధనతో పాటు సామాజిక చైతన్యం పెంపొందించుకోవాలని సూచించారు. సమాజ హక్కుల సాధనకు ఐక్యతే ప్రధానమని ఆయన పేర్కొన్నారు.
పలువురు వక్తలు గొల్ల–కుర్మా సమాజం ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడి ఉందని, ప్రభుత్వాల వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుల సంస్కరణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్ది రమేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ యాదవ్ వంటి నాయకులు విద్య, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమ్మేళనం గొల్ల–కుర్మా సమాజంలో ఐక్యత భావాన్ని మరింత బలపరిచిందని నిర్వాహకులు తెలిపారు.










