సంగారెడ్డి, 2026-08-11
కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్మారకార్థం నిర్వహిస్తున్న గీతన్నల చైతన్య రాష్ట్ర బస్సు యాత్ర ఆగస్టు 13వ తేదీ గురువారం సంగారెడ్డి జిల్లాకు చేరుకోనుంది. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు.
కల్లుగీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం ప్రజా సంఘాల భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆగస్టు 2వ తేదీన మహబూబాబాద్ లో ప్రారంభమైన అమరవీరుల స్మారకార్థం గీతన్నల చైతన్య రాష్ట్ర బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతూ 13వ తేదీ గురువారం సంగారెడ్డి జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు.
నర్సాపూర్ నుండి ఉదయం 8 గంటలకు హత్నూర మండలం దౌల్తాబాద్‌కు చేరుకుని, అక్కడ నుండి సంగారెడ్డికి 10 గంటలకు చేరుకుంటుందన్నారు. బస్సు యాత్ర సందర్భంగా సంగారెడ్డిలో పాత బస్టాండ్ వద్ద హనుమాన్ విగ్రహం నుండి భారీ బైక్ ర్యాలీతో బస్సు యాత్రకు స్వాగతం పలికి, అక్కడి నుండి పాపన్న గౌడ్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, అనంతరం బైపాస్ రోడ్డులో ఎక్సైజ్ కార్యాలయం పక్కన ఉన్న నాలుగో తరగతి ఉద్యోగుల భవనంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ బహిరంగ సభలో జిల్లాలోని కల్లుగీత కార్మికులు, గౌడ సోదరులు, వృత్తి శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని యాత్రను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు, గౌడ సోదరులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులందరూ వన మహోత్సవంలో భాగంగా ఈత, తాటి చెట్ల పెంపకం చేపట్టాలని సూచించారు.
ఈ యాత్ర ఈనెల 18 వరకు కొనసాగి, హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ముగుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్నగౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశం గౌడ్, యాదగౌడ్, కృష్ణగౌడ్, రామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.











