మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 05
ప్రభుత్వ రికార్డుల్లో తప్పుగా నమోదైన నెట్కాని అనే పేరును సరిచేసి నేతకానిగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ను కోరారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మంత్రిని కలిసి ఎంపీ వినతిపత్రాన్ని అందజేశారు.
ప్రభుత్వ రికార్డుల్లో తప్పుగా నమోదైన నెట్కాని అనే పేరును సరిచేసి నేతకానిగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని, తద్వారా నేతకాని సామాజిక వర్గానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
కేంద్ర మంత్రి హామీ
తెలంగాణ నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా కేంద్ర మంత్రిని కోరినట్లు వంశీకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదన రావడంతో పాటు, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి అవసరమైన సిఫార్సులు అందిన అనంతరం పేరు మార్పు ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు
ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులతో, మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తో చర్చించినట్లు వంశీకృష్ణ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
త్వరితగతిన ప్రక్రియ పూర్తికి కృషి
నేతకాని సమాజానికి చరిత్రలో న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేస్తూ, అవసరమైన అన్ని అనుమతులు, సిఫార్సులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఈ విషయంలో తమ వంతు సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.












