సంగారెడ్డి, 2024-08-27
సంగారెడ్డి జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
సంగారెడ్డి జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హృదయపూర్వక రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అన్నారు.
రద్దీ ప్రాంతాలు, మార్కెట్లు, బస్టాండ్లు, మహిళలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో షీ టీమ్స్ నిరంతరం నిఘా కొనసాగిస్తాయని అన్నారు. మహిళలు, బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా లేదా అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపించినా వెంటనే జిల్లా షీ టీమ్ నంబర్ 8712656772కు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజలు రాఖీ పౌర్ణమి పండుగను ప్రశాంతంగా, సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. చెల్లి కట్టే రాఖీ నీకు రక్షణ బంధం అయితే, నువ్వు ధరించే హెల్మెట్ నీ ప్రాణానికి రక్షణ కవచం అని తెలిపారు. రాఖీ కట్టే చెల్లి కోసం మాత్రమే కాదు, నీ కుటుంబం కోసం కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.












