భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం STPPలోని బ్యాచిలర్ ట్రైనీ హాస్టల్లో జరిగింది.
STPP ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) సి.హెచ్. చిరంజీవి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేశారు. STPP అధికారులు, సిబ్బంది, పవర్ మేక్ కంపెనీ, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ శిబిరంలో పాల్గొన్నారు.
ED సి.హెచ్. చిరంజీవి మాట్లాడుతూ, STPPలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఇది వరుసగా ఏడవ సారి అని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం కార్యాచరణకు పిలుపునిచ్చారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన ప్రతిపాదించిన "మానవ సేవ" స్ఫూర్తితో ఈ శిబిరం నిర్వహించడం ఆయన వారసత్వాన్ని గౌరవించడమేనని అన్నారు.
కుల, మత భేదాలకు అతీతంగా, 'అందరిలోనూ ఒకటే రక్తం ప్రవహిస్తుంది' అనే నినాదంతో, మానవులంతా సమానమే అనే ఉద్దేశ్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. 'రక్తదానం-మహాదానం' అని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని ఆయన కోరారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్ మాట్లాడుతూ, ఒక్కరు రక్తదానం చేస్తే అది ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని, సేకరించిన రక్తం గర్భిణీ స్త్రీలకు, సికిల్ సెల్, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుందని చెప్పారు.








