మాజీ ఆర్మీ జవాన్, ప్రస్తుత ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ పివ్ హల్, రాణి పివ్ హాల్ దంపతులు తమ నివాసంలో గురువారం వినాయక్ దామోదర్ సావర్కర్ (వీర్ సావర్కర్) 143వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావర్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రాజేష్ పివ్ హల్ మాట్లాడుతూ, వినాయక్ దామోదర్ సావర్కర్ భారత స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన మే 28, 1883న మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గల భాగూర్ గ్రామంలో జన్మించారని గుర్తు చేశారు.
సావర్కర్ తన విద్యార్థి దశలోనే 'మేళా' అనే సంస్థను స్థాపించి, తరువాత దానిని 'అభినవ్ భారత్'గా మార్చారని, లండన్ లో బారిస్టర్ చదువుతున్నప్పుడు 'ఇండియా హౌస్' ద్వారా విప్లవకారులను సంఘటితం చేశారని వివరించారు.
బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై నాసిక్ కలెక్టర్ జాక్సన్ హత్య కేసులో ఆరోపణలు మోపి, 1910లో అరెస్ట్ చేసి, రెండుసార్లు యావజ్జీవ శిక్ష విధించిందని తెలిపారు. అండమాన్ సెల్యులార్ జైలులో 12 సంవత్సరాలు గడిపిన ఆయన, అక్కడే 'ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857' పుస్తకాన్ని పూర్తి చేశారని, 'హూ ఈజ్ ఏ హిందూ' గ్రంథం ద్వారా హిందూ జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేశారని పేర్కొన్నారు.
జీవితాంతం దేశం కోసం పోరాడిన సావర్కర్, ఫిబ్రవరి 26, 1966న ముంబైలో తుదిశ్వాస విడిచారని, నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్. రమేష్, సిహెచ్, మహేందర్, రాజు, శంకర్, డి. తిరుపతి, రోజా, సుశీల, లక్ష్మి, చంద్రకళ, నిర్మల, రజిత, శ్రీజలు తదితరులు పాల్గొన్నారు.












