మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించాలనే హామీని ప్రభుత్వం నెరవేర్చడం లేదని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల వాగ్దానాన్ని 30 నెలలైనా అమలు చేయలేదని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపిస్తూ కార్పొరేషన్ ముందు ఆందోళన చేపట్టింది.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో అర్హత కలిగిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తామన్న హామీలు బుట్టదాఖలు అయ్యాయని, ఎన్నికల వాగ్దానం చేసిన కాంగ్రెస్ పార్టీ 30 నెలలైనా దానిని అమలు చేయలేదని బీజేపీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ ఆరోపించారు. మంచిర్యాలలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, గతంలో 335 జాబితాకు ఇళ్లు అందించలేదని, ఇళ్లు కూల్చిన 30 మంది బాధితులకు సైతం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. నిర్మించిన 300 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయని, కాంగ్రెస్ కార్పొరేటర్ల డివిజన్ నుండి 12 మంది అనుకూలురకు లక్కీ డ్రా చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇంటికి రెండు లక్షల చొప్పున 30 కోట్లు నిధులు మంచిర్యాలకు వచ్చాయని, అయితే ప్రభుత్వం అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ముఖేష్ గౌడ్ ఆరోపించారు. నిజమైన డబుల్ బెడ్ రూమ్ అర్హులు అందించాలని డిమాండ్ చేశారు. కమిషనర్‌కు బాధితుల పక్షాన బీజేపీ నిలుస్తుందని, నిజమైన అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందేదాకా పోరాటం చేస్తామని తెలిపారు. బాధితుల దరఖాస్తుల స్వీకరణలో తాముంటామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ముందు ఆందోళన విరమింప చేసేందుకు ఇన్చార్జి కమిషనర్ రాజు ఆందోళనకారుల పత్రాల స్వీకరణతో నిరసన ముగిసింది.
కాషాయ దళం సమరం
30 నెలల పాలనలో అందని డబుల్ బెడ్ రూములు అర్హులకు నిరాశ, నిస్పృహ, నిరాదరణ మిగిల్చాయని అన్నారు. ఈ విషయమై కాషాయ దళం సమరం చేస్తుందని ముఖేష్ గౌడ్ స్పష్టం చేశారు.










