తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సంగీత ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పూజలు చేసి, ఆటపాటలతో సందడి చేశారు.
ప్రపంచంలో పూలతో జరుపుకునే అరుదైన పండుగ బతుకమ్మ అని, ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పండుగను తెలంగాణ ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారని తెలిపారు. పండుగ విశిష్టతను చాటిచెప్పేలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని ఆయన సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నేటి నుండి 17వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలు, యువత, మహిళా ఉద్యోగులు, కలెక్టరేట్ చుట్టు పక్కల గల కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. బతుకమ్మ సంబురాల నిర్వహణకు శాఖల వారీగా రోజువారీ షెడ్యూల్ను రూపొందించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 17 వరకు కలెక్టరేట్ ప్రాంగణంలో పెద్దఎత్తున బతుకమ్మ సంబురాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.












