ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం చెన్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యక్రమంలో ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందే విధంగా అందరూ సమన్వయంతో పని చేయాలని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వరి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుందని, సన్నరకం వడ్లకు బోనస్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో దాదాపు 3,500 ఇండ్లు స్లాబ్ స్థాయి వరకు పూర్తయ్యాయని, అర్హత కలిగి ఉండి ఇండ్లు రానివారు దరఖాస్తు చేసుకున్నట్లయితే మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు గుత్తేదారుల ద్వారా నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళ్యాణ లక్ష్మీ, పెన్షన్ పథకాల అమలులోనూ అర్హులందరికీ లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చెన్నూర్ పట్టణంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉందని, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక శాతం పెరిగిందని, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్.ఓ. ప్లాంట్లు, కాస్మోటిక్, డైట్ చార్జీల పెంపుతో పాటు మెనూ అమలుపై దృష్టి సారించాలని సూచించారు.
అంతర్గత రహదారులు, మురుగు కాలువ వ్యవస్థ అభివృద్ధి, సౌర విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పట్టణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, గ్రామాలకు రహదారుల అనుసంధానం ద్వారా ప్రభుత్వ సేవలను విస్తరించాలని ఆదేశించారు. డి.ఎం.ఎఫ్.టి., సిఎస్ఆర్ నిధుల ద్వారా చేపట్టిన పనులు, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు సంబంధించిన వివరాలను సమర్పించాలని, మంజూరు చేసిన నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలని సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంక్ నిర్వహణ వంటి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి మరింత రుణం పొందవచ్చని, వ్యాపార రంగాలలో మహిళలు అభివృద్ధి చెందేందుకు శిక్షణ అందించి ఆర్థిక స్వావలంబన పొందేలా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. పథకాల అమలులో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.








