ఎల్కతుర్తి మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఎదుర్కొంటున్న పరిస్థితులు అనుమానాస్పదంగా, దురదృష్టకరంగా ఉన్నాయని ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు బొంకూరి రాజు అన్నారు. మండల ప్రజలలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కు మంచి పేరు, నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఎవరినీ కించపరచకుండా, ప్రతి ఒక్కరినీ గౌరవంగా పలకరించి, సమస్యలు విని వెంటనే పరిష్కారం చూపే అధికారిగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పేరు సంపాదించుకున్నారని బొంకూరి రాజు తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా, నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజలను తిరస్కరించకుండా, సమస్య పరిష్కారంలో ముందుండి సహాయం చేసే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారని ధర్మసమాజ్ పార్టీ నాయకుడు తెలిపారు. చిన్న చిన్న వ్యాపారుల మధ్య తలెత్తిన తగాదాలను సైతం సమర్థంగా పరిష్కరించడంలో ఆయన పాత్ర ప్రశంసనీయంగా ఉందని, మండలంలో యువకులు పెడదారిన పట్టకుండా ప్రతి గ్రామంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారని ఆయన వివరించారు.
ఇలాంటి మంచి అధికారిపై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కావాలనే కక్షపూరితంగా సృష్టించబడినవే తప్ప, ఆయన వద్ద ఎలాంటి తప్పు లేదని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని బొంకూరి రాజు పేర్కొన్నారు. గతంలో కూడా ఈ పోలీస్ స్టేషన్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు గమనార్హమని ఆయన తెలిపారు.
అందువల్ల, ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, నిర్దోషి అయిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారికి న్యాయం చేయాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా నాయకులు బొంకూరి రాజు ప్రభుత్వాన్ని కోరారు.












