సంగారెడ్డి, 2026-08-10
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని లో గడువు ముగిసిన ల్యాబొరేటరీ కిట్లు, స్కానింగ్ విభాగం అనుమతులు లేకపోవడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రి ల్యాబొరేటరీని, స్కానింగ్ రూమ్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ డా. కె. లలితాదేవి ఆదేశాలు జారీ చేశారు.
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. లలితాదేవి, డా. దీప్తి, డా. ఎ. ప్రవీణ్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆసుపత్రి ల్యాబొరేటరీలో గడువు ముగిసిన ల్యాబొరేటరీ కిట్లు గుర్తించడంతో పాటు, స్కానింగ్/అల్ట్రాసౌండ్ విభాగానికి అవసరమైన అనుమతి, రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోలేదని అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు ల్యాబొరేటరీని, స్కానింగ్ రూమ్‌ను తక్షణమే సీజ్ చేశారు.
ఆసుపత్రి ల్యాబొరేటరీలో గడువు ముగిసిన కిట్లను ఉపయోగించడం వల్ల పరీక్షల ఫలితాల ఖచ్చితత్వంపై ప్రభావం పడటంతో పాటు, రోగుల ఆరోగ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ల్యాబొరేటరీని తక్షణమే సీజ్ చేశారు.
అదే విధంగా ఆసుపత్రిలోని స్కానింగ్/అల్ట్రాసౌండ్ విభాగానికి సంబంధించిన అనుమతి, రిజిస్ట్రేషన్ గడువు సోమవారంతో ముగియనున్నప్పటికీ, దాని పునరుద్ధరణకు అవసరమైన దరఖాస్తును ఆసుపత్రి యాజమాన్యం సమర్పించలేదని తనిఖీలో గుర్తించారు. చెల్లుబాటు అయ్యే అనుమతి లేకుండా స్కానింగ్ సేవలు నిర్వహించకుండా ఉండేందుకు స్కానింగ్ రూమ్‌ను కూడా అధికారులు సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డా. కె. లలితాదేవి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు, రోగుల భద్రతా నిబంధనలు, చట్టపరమైన అనుమతులను పాటించాలని సూచించారు. గడువు ముగిసిన మందులు, ల్యాబొరేటరీ కిట్లు లేదా ఇతర వైద్య సామగ్రిని వినియోగించడం, చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించడం ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు తమ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, అనుమతులు, ల్యాబొరేటరీ కిట్ల గడువు తేదీలు, తప్పనిసరి రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని డీఎంహెచ్ఓ హెచ్చరించారు.












