తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాలల పరిరక్షణ అధికారి దండు లింగం హామీ ఇచ్చారు. మనూరు గ్రామంలో చెరువు ప్రమాదంలో మృతి చెందిన దంపతుల పిల్లలను ఆయన పరామర్శించారు.
జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆదేశాల మేరకు సోమవారం మనూరు గ్రామంలో ఇటీవల చెరువులో పడి మృతి చెందిన నరసింహ రెడ్డి, కృష్ణవేణి దంపతుల పిల్లలు విష్ణువర్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలను దండు లింగం పరామర్శించారు. బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లిన దంపతులు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. దీంతో వారి పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో మిగిలారు. ఈ సందర్భంగా పిల్లల నానమ్మ, ఇతర కుటుంబ సభ్యులను కలిసి వారికి భరోసా కల్పించారు. బాలల పరిరక్షణ విభాగం తరఫున ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ ఆర్థిక సహాయం జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపుతామని వెల్లడించారు. పిల్లల భవిష్యత్తు, విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమ్య సిద్ధారెడ్డి, గ్రామ పెద్దలు డాక్టర్ సిద్ధేశ్వర్, సంగారెడ్డి ప్రవీణ్, సంగం మారుతి, విట్టల్, అంగన్వాడీ టీచర్లు శ్రీనివాస్, సాంబ, విమల, గ్రామస్తులు పాల్గొన్నారు.


