పట్టణంలో ఆర్థిక భారంతో సతమతమవుతున్న ఒక ఆటో డ్రైవర్ తన వికలాంగుడైన కుమారుడి వైద్యం కోసం సహాయం కోరగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్పందించింది. రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లయన్ వి. మధుసూదన్ రెడ్డి, బాలుడికి అవసరమైన మందులను అందజేశారు.
పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన నరసయ్య అనే ఆటో డ్రైవర్ కు ఇద్దరు సంతానం జన్మించి మరణించారు. మూడవ సంతానంగా జన్మించిన విక్రమ్ (7) మానసిక, శారీరక, అంగ వైకల్యంతో పుట్టుకతోనే అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని తల్లి కూడా మూర్ఛ వ్యాధితో () బాధపడుతోంది. వైద్యం కోసం లక్షలు ఖర్చు చేయడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక భారంతో పేదరికంలో మగ్గుతోంది. హైదరాబాదులోని వైద్యుల సలహా మేరకు, వికలాంగుడైన తన కుమారుడి మందుల కోసం సహాయ శాఖల నుంచి సహాయం అందించాలని జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధి, ఇండియన్ డెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లయన్ వి. మధుసూదన్ రెడ్డిని నరసయ్య ఆశ్రయించారు. ఆయన తక్షణమే స్పందించి, వికలాంగుడైన కుమారుడు విక్రమ్ కు ఒక సంవత్సరం పాటు అవసరమైన మందులను అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు రెండవ విడతగా, రెండు నెలలకు సరిపడా ఖరీదైన మందులను తండ్రి సమక్షంలో బాలుడికి అందజేశారు. ఈ సందర్భంగా లయన్ వి. మధుసూదన్ రెడ్డి, మానవతా దృక్పథంతో పట్టణంలోని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు స్పందించి, మానసిక, శారీరక వికలాంగుడైన విక్రమ్ కు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.












