మంచిర్యాల జిల్లా కేంద్రంలో వేసవి తాపాన్ని తగ్గించేందుకు, ప్రజలకు చల్లదనాన్ని అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న 'దివాకర్ అన్నం' కార్యక్రమం విశేష ఆదరణ పొందుతోంది. దివాకర్ రావు స్మారకార్థం, ఎమ్మెల్యే తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు.
వేసవిలో కడుపులో చల్లదనాన్ని ఇచ్చే పెరుగు అన్నం, రుచికరంగా ఉండటంతో ప్రజలు దీనిని పెద్ద ఎత్తున స్వీకరిస్తున్నారు. మొదట్లో బస్టాండ్ ప్రాంతంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం, అభాగ్యులు, అనాధలు, రోగులు ఎక్కువగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రాంతానికి తరలించబడింది. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1000 మందికి పైగా పెరుగు అన్నాన్ని అందిస్తున్నారు.
మంచి పెరుగుతో, ఎండుమిర్చి పోపు, పచ్చడితో కలిపి తయారుచేసే ఈ పెరుగు అన్నం, తినేవారికి ఎంతో రుచికరంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. మధ్యాహ్న భోజనంలో పెరుగు అన్నం కోసం జనం గుమిగూడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆసుపత్రిలో ఉన్నవారు, పేదలు, అభాగ్యులు ఈ సేవను అందుకుంటూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు దీవెనలు అందిస్తున్నారు.
మంచిర్యాల ప్రజల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశ్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు తెలిపారు. మే నెలలో ప్రారంభమైన ఈ పెరుగు అన్నం పంపిణీ కార్యక్రమం, అందరికీ వేసవిలో చల్లదనాన్ని అందిస్తూ కొనసాగుతోంది. సద్దన్నం, దద్దోజనం, కార్డ్ రైస్ వంటి వివిధ రూపాల్లో పెరుగు అన్నం తయారీ ఉంటుందని, దీనిని అపరిమితంగా పంపిణీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆయన అన్నారు.
తన తండ్రి దివాకర్ రావు పేరిట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తాను ఉన్నంతవరకు నిరంతరాయంగా కొనసాగిస్తానని విజిత్ రావు తెలిపారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా 'అక్షరవేకువ'తో ఆయన మాట్లాడారు.












