ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాంపూర్, పారుపల్లి గ్రామాలలో రోడ్డు భద్రత, మహిళల భద్రతపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పోలీసు అధికారులు హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు.
చెన్నూర్ రూరల్ CI కృష్ణ, కోటపల్లి SI రాజశేఖర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, మైనర్లకు వాహనాలు అప్పగించరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మహిళల భద్రతకు పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని, షీ టీమ్స్ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి సమస్యలకైనా పోలీసులను సంప్రదించవచ్చని భరోసా ఇచ్చారు.
ఈ గ్రామసభలలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.








