జిల్లాకు చెందిన 130 మందికి పైగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు క్యాంపస్‌లోని వివిధ విభాగాలు, ప్రయోగశాలలను పరిశీలించారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి విద్యార్థులతో మాట్లాడి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
జిల్లాకు చెందిన 130 మందికి పైగా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌లోని వివిధ విభాగాలు, ప్రయోగశాలలను సందర్శించి, అక్కడి విద్యా వాతావరణం, పరిశోధనలు, సాంకేతిక సదుపాయాలను పరిశీలించారు. అలాగే, ఫ్యాకల్టీ సభ్యులతో ముచ్చటించే అవకాశం పొందారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని ఆయన సూచించారు. ఐఐటీ హైదరాబాద్‌లోని సదుపాయాలతో పాటు, విద్యార్థులు, ఫ్యాకల్టీ చేస్తున్న పరిశోధనలు, ఆవిష్కరణలు, వారి కృషి నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన సూచించారు. ఈ సందర్శన విజిట్ ఐఐటీహెచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. విద్యార్థులు, ప్రజలు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ను ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడి విద్యా, పరిశోధనా వాతావరణాన్ని తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోర్టల్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకున్న వారికి ప్రతి శనివారం వివిధ సమయాల్లో క్యాంపస్ సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థి వాలంటీర్లు, క్యాంపస్ గైడ్ అంబాసిడర్లు సందర్శకులకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండగా, ఇప్పటివరకు 10,000 మందికి పైగా విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థను ప్రత్యక్షంగా సందర్శించే అవకాశం కల్పించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఉన్నత విద్యపై ఆసక్తిని పెంపొందించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.












