ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంధన వనరుల వినియోగంలో పొదుపు పాటిస్తూ, విద్యుత్ సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ సంగీత సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీజీఆర్ఈడీసీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మిషన్ లైఫ్ పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఎల్నినో ప్రభావం కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్, ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని అదనపు కలెక్టర్ సంగీత సూచించారు. సహజ వనరులను సంరక్షిస్తూ పర్యావరణహిత జీవన విధానాలను అలవర్చుకోవాలని ఆమె అన్నారు. అవసరం లేనప్పుడు విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలను నిలిపివేయాలని, విద్యుత్ ఆదా చేసే అధిక సామర్థ్యం కలిగిన ఉపకరణాలను వినియోగించాలని సూచించారు. బ్రిక్స్ () - సుస్థిర జీవనశైలి వారోత్సవాలు () భాగంగా 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ఇంధన పరిరక్షణ, పర్యావరణ బాధ్యతాయుత జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు టీజీఆర్ఈడీసీఓ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా విద్యుత్ ఆదా చేసే విధంగా వినియోగించడం ద్వారా ఇంధనాన్ని పొదుపు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న మార్పులతో పెద్ద ప్రయోజనాలు సాధించవచ్చని, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంగీత, వివిధ శాఖల అధికారులతో కలిసి ఇంధన పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేష్ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలిత దేవి, డీఏహెచ్ఓ వసంతకుమారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.












