జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్ కేసులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ లో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దర్యాప్తులో నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రత, సైబర్ నేరాల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలపై పలు కీలక సూచనలు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల పురోగతిని ఎస్పీ సమీక్షించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసులు, మిస్సింగ్ కేసుల ఛేదన, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని, నిర్ణీత గడువులోగా కేసులను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా సమర్థవంతమైన దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ సూచించారు. నిజమైన దోషులకు శిక్ష పడినప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. దర్యాప్తులో సాంకేతిక లేదా న్యాయపరమైన సందేహాలు తలెత్తినప్పుడు ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులను కలుపుతూ ఉన్న ప్రధాన రహదారులపై అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారులను ఆనుకొని ఉన్న గ్రామాల్లో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్స్ నిరంతరం అప్రమత్తంగా పని చేయాలని, మహిళలపై వేధింపులను అరికట్టడంతో పాటు మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ అన్నారు. నేర దర్యాప్తులో కీలకంగా ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, ప్రతి గ్రామంలోని కీలక ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్హెచ్ఓలకు సూచించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విలేజ్ పోలీస్ అధికారులు గ్రామ ప్రజలు, యువతతో సత్సంబంధాలు కలిగి ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఉత్సవాలు ముగిసే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా గ్రామాల్లో రౌడీషీటర్లు, కేడీలు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్, ఎస్హెచ్ఓలకు కేటాయించిన పోలీసు వాహనాల స్థితిగతులను పరిశీలించారు. ప్రతి వాహనానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉంచాలని డ్రైవర్లను ఆదేశించారు. విధి నిర్వహణలో అవసరమయ్యే ఎమర్జెన్సీ కిట్లు ఎల్లప్పుడూ వాహనాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వాహనాలను పరిశుభ్రంగా ఉంచిన డ్రైవర్లను అభినందించి, వారికి రివార్డులు ప్రకటించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి, నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. పోలీస్ స్టేషన్ల స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందించేందుకు సిఫారసు చేయాలని ఎస్హెచ్ఓలకు సూచించారు. ఈ నెలవారీ నేర సమీక్షా సమావేశంలో డీఎస్పీలు సత్తయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, సబ్ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.












