నెలలు నిండకముందే, కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువుకు సంగారెడ్డిలోని శిశురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు అరుదైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. 50 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించిన అనంతరం, శిశువు ఆరోగ్యం మెరుగుపడింది. ఈ సందర్భంగా వైద్యులను, ఆసుపత్రి యాజమాన్యాన్ని జగ్గారెడ్డి అభినందించారు.
సంగారెడ్డి పట్టణంలోని శిశురక్ష చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు అరుదైన చికిత్స అందించి, నవజాత శిశువు ప్రాణాలను కాపాడారు. నెలలు నిండకముందే, కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు వారు పునర్జన్మనిచ్చారు. ఊపిరితిత్తులు సరిగా అభివృద్ధి చెందకపోవడం, కిడ్నీలు పనిచేయకపోవడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. శిశువును వెంటిలేటర్‌పై ఉంచి, విజయవంతంగా చికిత్స అందించారు. 50 రోజుల చికిత్స అనంతరం, ఆ పసిబిడ్డ బరువు 1.6 కిలోలకు పెరిగింది. అత్యంత విషమంగా ఉన్న నవజాత శిశువును శిశురక్ష ఆసుపత్రి వైద్యులు బతికించారని తెలుసుకున్న జగ్గారెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లారు. నవజాత శిశువును చూసి, వైద్యులను, ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా, సంగారెడ్డిలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించి, పసిబిడ్డకు ప్రాణం పోసిన తీరును ఆయన ప్రశంసించారు. శిశురక్ష ఆసుపత్రి వైద్యులు ఆ శిశువును కంటికి రెప్పలా కాపాడి, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో సంతోషం నింపారని ఆయన వివరించారు. 50 రోజుల చికిత్సకు గాను దాదాపు నాలుగు లక్షల రూపాయలకు పైగా బిల్లు అయింది. శిశువు తల్లిదండ్రులు రెండు లక్షల రూపాయల వరకు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని తాను చెల్లిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. అయితే, ఆసుపత్రి యాజమాన్యం బిల్లులో సగం మినహాయింపు ఇచ్చింది.












