ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. పిల్లల వార్డులో రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలి మంటలు వ్యాపించడంతో ఒకరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో వార్డులో 27 మంది పిల్లలు ఉన్నారు.
ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి పిల్లల వార్డులో రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో వార్డులో 27 మంది పిల్లలు ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని అధికారులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద వార్త తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల వార్డులో అగ్నిప్రమాదం సంభవించడంపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












