జిల్లా పోలీసు కార్యాలయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీసు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రకృతి అందాలు, ఆచార సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆటపాటలతో వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ పాటలు, కోలాటాలు, ఆటపాటలతో పోలీసు కుటుంబ సభ్యుల సందడి మధ్య వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు, పోలీసు కుటుంబాల మధ్య ఆత్మీయత, ఐక్యతను పెంపొందించేలా ఈ వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.












