సంగారెడ్డి, 2026-08-22
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డిలో ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ ప్రాముఖ్యతను, ఫోటో జర్నలిస్టుల సేవలను పలువురు ప్రముఖులు కొనియాడారు. ఫోటోల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని, వెయ్యి పదాలు చెప్పలేని విషయాన్ని ఒక్క ఫోటో సులభంగా తెలియజేస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్ లో ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అతిథులు ఫోటో జర్నలిస్టులందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఒక ఫోటోను చూడగానే దానికి సంబంధించిన జ్ఞాపకాలు మనసులో మెదులుతాయని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో ఛాయాచిత్రాలను ఎండనక, వాననక నిరంతరం వృత్తి పట్ల అంకితభావంతో ఫోటో జర్నలిస్టులు చిత్రీకరిస్తున్నారని, సమాజ సేవలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఫోటో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, తనకు ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. చిన్నతనంలో రీల్ కెమెరాలతో ఫోటోలు తీసి, అనంతరం ఫోటో ల్యాబ్‌కు వెళ్లి వాటిని ప్రింట్ చేయించుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. జీవితంలో కొన్ని ఛాయాచిత్రాలు ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని, అవి మరింత స్ఫూర్తిని కలిగిస్తాయని అన్నారు.
ఒకే ఫోటోను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారని, ఒక్క ఛాయాచిత్రం ద్వారా ప్రజల్లోనూ, ప్రభుత్వ యంత్రాంగంలోనూ కదలిక తీసుకురాగల సందర్భాలు ఎన్నో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. నేటి కాలంలో వార్తాపత్రికల్లో ఫోటోకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఒక వార్తను చదివే ముందు చాలామంది ముందుగా ఫోటోను చూసి ఆ వార్త ప్రాధాన్యతను అంచనా వేస్తున్నారని అన్నారు. అనేక భావాలు, విషయాలను ఒక్క ఛాయాచిత్రం ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు.
ఫోటోగ్రఫీ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా ఫోటోలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఫోటో జర్నలిస్టులు ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడే మంచి అంశాలను కూడా తమ కెమెరాల్లో బంధించాలని సూచించారు. సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఛాయాచిత్రాల ద్వారా అందించాలని కోరారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లోని ఫోటోలను చూస్తుంటే గతంలో జరిగిన అనేక సంఘటనలు కళ్లముందు ఫ్లాష్‌బ్యాక్‌లా కనిపించాయని అన్నారు. వివిధ అంశాలకు సంబంధించిన ఫోటోలు ప్రదర్శనలో ఉన్నాయని, వెయ్యి పదాలు చెప్పలేని విషయాన్ని ఒక్క ఫోటో ఎంతో సులభంగా అర్థమయ్యేలా చెబుతుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను కొనసాగించాలని సూచించారు.











