సంగారెడ్డి, 2026-08-20
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టడంతో పాటు పీసీ పీఎన్డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్వో) డాక్టర్ కే.లలితదేవి సూచించారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టడంతో పాటు పీసీ పీఎన్డీటీ (ప్రినేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్) చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎం అండ్ హెచ్వో) డాక్టర్ కే.లలితదేవి సూచించారు. ఈ మేరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
డీఎంహెచ్వో డాక్టర్ కే.లలిత దేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైద్య నిపుణులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని స్కానింగ్ కేంద్రాల పనితీరు, పీసీ పీఎన్డీటీ చట్టం అమలు తీరు, రికార్డుల నిర్వహణ, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలు, లింగ నిర్ధారణ నిషేధానికి సంబంధించిన నిబంధనలపై అధికారులు సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ లలిత దేవి మాట్లాడుతూ, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం, చేయించడం లేదా ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. బాలికల పట్ల వివక్షను నివారించి, ఆడ శిశువుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు.
లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో పీఓఎంసీహెచ్ డాక్టర్ నాగనిర్మల, డాక్టర్ ప్రవీణ్, డీఈఎంఓ వనజారెడ్డి, డాక్టర్ రాజుగౌడ్, డాక్టర్ శైలజ, డాక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.












