గాంధీ జయంతి సందర్భంగా, జాతీయ జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని, సంగారెడ్డి పట్టణ జిల్లా పరిషత్ ప్రాంగణంలో గల మహాత్మా గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. మీడియా రంగాన్ని సమగ్రంగా సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విధాన సిఫారసులు చేసేందుకు సమగ్ర మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు జోగిపేట యాదగిరి, వెంకట రెడ్డి, సంఘం జిల్లా కోశాధికారి అన్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, శ్రీనాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విల్సన్, ఉలవల రాజు, అంజయ్య, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాసరెడ్డి, సుమన్, చిన్న మధ్యతరహా పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్ధిక్, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చవాన్, కోశాధికారి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు నజీర్, సీనియర్ జర్నలిస్టు మధుసూదనాచారి, రథసారథి సీఈవో సంతోష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయరాజు, పరంజ్యోతి, నాగరాజుగౌడ్, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్, ఇతర నేతలు సంతోష్, సత్యం, సాక్ష్యం శ్రీనివాస్, నవీన్, పటాన్చెరు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పత్తి నరసింహ, ప్రధాన కార్యదర్శి యాదగిరి, బొల్లారం నాయుడు, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.












