పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ విషయాన్ని తెలిపారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్‌లు తీసేవారి కోసం ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ పోటీల్లో పోలీసుల విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించిన అంశాలపై 2023 నుంచి 2024 వరకు తీసిన 3 ఫోటోలు, అలాగే 3 నిమిషాల నిడివి మించని షార్ట్ ఫిల్మ్‌లను ఈ నెల 22వ తేదీలోపు పోటీలకు పంపించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో అందిన ఎంట్రీల నుంచి ఉత్తమ మూడు షార్ట్ ఫిల్మ్‌లు, మూడు ఫోటోలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని సంగారెడ్డి జిల్లాలోని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్‌లు తీసేవారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు, పోలీసుల సేవలు, విధి నిర్వహణ వంటి అంశాలను ప్రతిబింబించే మంచి ఫోటోలు, షార్ట్ ఫిల్మ్‌లను పోటీలకు పంపాలని అన్నారు. ఈ నెల 22వ తేదీలోపు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలోని పోలీస్ పి.ఆర్.ఓ. సెక్షన్లో అందజేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. మరిన్ని వివరాల కోసం పి.ఆర్.ఓ. నంబర్ 8712539040ను సంప్రదించాలని తెలిపారు.












