గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులను ఘనంగా సన్మానించారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థులు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న నాయకులను సత్కరించారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, బీసీ విద్యార్థుల సమస్యలు, బీసీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ప్రభుగౌడ్, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, బీసీ వర్గాల ప్రజలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీసీ సంక్షేమ సంఘం నిరంతరం ప్రజల తరఫున పోరాడుతోందని పేర్కొన్నారు. బీసీ విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపరచాలని, ప్రజల సంక్షేమం కోసం సంఘం మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కోశాధికారి సుధాకర్ గౌడ్, విశ్రాంత సైనిక సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.











