ప్రజల కోసం నిలబడిన ధైర్యశాలిగా, అన్యాయాన్ని ఎదిరించి బలహీన వర్గాలకు అండగా నిలిచిన పండుగ సాయన్న సేవలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గురువారం పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, పండుగ సాయన్న ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ఆయన జీవితం ధైర్యం, పోరాట పటిమ, ప్రజల పట్ల బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. ముఖ్యంగా యువత అన్యాయానికి దూరంగా ఉంటూ, న్యాయం వైపు నిలబడాలని, సమాజంలో శాంతి, సామరస్యం, సమానత్వం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. పోలీసులుగా ప్రజల భద్రతను కాపాడటం, బలహీనులకు అండగా నిలవడం, బాధితులకు చట్ట పరిధిలో న్యాయం అందించడం తమ ప్రధాన బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహనీయుల సేవలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు చేరుతాయని ఆయన తెలిపారు. పండుగ సాయన్న ఆశయాలను స్మరించుకుంటూ, సమానత్వం, న్యాయం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి పద్మావతి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్ఐలు సురేష్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











