ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాల్సిన సదాశివపేట బస్టాండ్ పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. బస్టాండ్ పరిసరాలను చూస్తే ఇది ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రదేశమా లేక డంపింగ్ యార్డా అనే అనుమానం కలుగుతోంది. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్రతతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బస్టాండ్‌లోకి వెళ్లే సమయంలోనే దుర్వాసన వస్తుండటంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు సైతం పరిసరాల దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఆరోగ్యం, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్, ఆర్టీసీ అధికారులు పరస్పర సమన్వయంతో బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. చెత్తను వెంటనే తొలగించడంతో పాటు, మళ్లీ చెత్త పేరుకుపోకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












