మండలంలో తెలంగాణ హరితహారం కింద నాటిన చెట్లు కొమ్మల తొలగింపు పేరుతో నరికివేయబడుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
హాజీపూర్ మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమం కింద నాటిన చెట్లు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. కొమ్మల తొలగింపు పేరుతో చెట్లను మొదలు నుంచే నరికివేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్ద మనుషులు సొమ్ము చేసుకుంటున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చింది. ఇందులో భాగంగా రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం వృక్షాలుగా మారి నీడనిస్తున్నాయి. చాలా చోట్ల ప్రజలకు ఉపశయనం కలిగిస్తున్నాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం పట్టింపులేనితనం, అధికారుల అసమర్థతతో అవి నరికివేతకు గురవుతున్నాయి. కొమ్మల తొలగింపు పేరుతో చెట్లను మొదలు నుంచే నరికివేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని నoన్నూర్, గుడి పేట, రాపల్లి, పడతనపల్లి, కర్ణమామిడి పునరావాస కాలనీలతో పాటు మంచిర్యాల డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో హరితహారం చెట్లు ఏపుగా పెరిగాయి. అయితే ప్రస్తుతం ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. చెట్ల కొమ్మల నరికివేత పేరుతో ఏకంగా మొత్తానికే నరికివేస్తూ పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రాపల్లి గ్రామ శివారులో గల ఓ బ్రెడ్ కంపెనీకి సంబంధించిన నిర్వహణ అంతా కట్టెలు, బొగ్గులతో కొనసాగుతుంది. రెండేళ్లుగా కొందరు అధికార పార్టీ నాయకులు హరితహారం చెట్లను నరికి, వారికి విక్రయించడమే పనిగా పెట్టుకున్నారని స్థానికులు అంటున్నారు.
ఈదురుగాలులు, గాలివాన వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా, తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించే పనులకు విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టింది. నరికివేత సమయంలో విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణ అవసరం కాగా, ఇందుకు విరుద్ధంగా వ్యవహారం సాగుతోందని పేర్కొంటున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17, 18 డివిజన్ల గుడి పేట, నoన్నూరుతో పాటు రాపల్లి గ్రామపంచాయతీలకు చెందిన అధికార పార్టీ నాయకులు కొమ్మల నరికివేత పేరుతో తెలంగాణ హరితహారం చెట్లను నరికివేస్తూ, బ్రెడ్ కంపెనీకి అమ్ముతూ వ్యాపారం కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తొలగించకపోగా, అధికార పార్టీ నాయకులు తొలగించడం ఏమిటని, సంబంధిత అధికారులు తొలగించిన జేసీబీ తగిలి చెట్టు కింద పడిపోయినట్లుగా డ్రైవర్‌కు జరిమానా విధించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలను మానుకొని, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై లక్షెట్టిపేట డిప్యూటీ రేంజర్ సునీతను వివరణ కోరగా, విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. అలాగే, లక్షెటిపేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ సునీతకు ఫోన్ చేయగా, ఆమె అందుబాటులోకి రాలేదు.












