రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలో ముదిరాజుల సామాజిక అభివృద్ధి కోసం నిర్మిస్తున్న భవనాన్ని పలు రాజకీయ పార్టీలకు చెందిన ముదిరాజు అగ్ర నాయకులు గురువారం పరిశీలించారు. పార్టీలకు అతీతంగా తమ జాతి అభివృద్ధి కోసం వీరంతా ఏకతాటిపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, ముదిరాజ్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసాని వీరేష్, ఇతర ముదిరాజు నాయకులు కోకాపేటలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సందర్శించారు.
ముదిరాజుల సర్వతోముఖాభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, ఈ లక్ష్య సాధనలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పండగ సాయన్న, కొరివి కృష్ణస్వామి, కానిస్టేబుల్ కృష్ణయ్య వంటి స్ఫూర్తిదాయక వ్యక్తుల బాటలో తమ జాతి భవిష్యత్తు కోసం పనిచేస్తామని తెలిపారు.
రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, సామాజిక వర్గ అభివృద్ధి కోసం నాయకులు ఏకమవడం ముదిరాజు సమాజంలో సానుకూల స్పందనలకు దారితీసింది. ఈ భవనం నిర్మాణం పూర్తయితే, ముదిరాజుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన పురోగతికి ఇది ఒక వేదికగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
తమ జాతి అభివృద్ధి కోసం నాయకులు ఐక్యంగా ముందుకు రావడం పట్ల ముదిరాజ్ సమాజం కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ ఐక్యత భవిష్యత్తులోనూ కొనసాగాలని, తమ సామాజిక వర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించింది.












