భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఎస్ స్టి పి పి లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడి) సిహెచ్. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంగవల్లులతో రూపొందించిన భారీ అంబేద్కర్ చిత్రపటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఎస్టీపిపి క్రికెట్ స్టేడియంలో అధికారులు, ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంబేద్కర్ చిత్రపటం చుట్టూ మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం, అక్కడి నుంచి మెయిన్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ అనంతరం, అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన సభలో, ఈడీ సిహెచ్. చిరంజీవి జ్యోతి ప్రజ్వలన చేసి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ ను రాజ్యాంగ శిల్పి, గొప్ప సామాజిక, ఆర్థిక వేత్తగా కొనియాడారు.
అంబేద్కర్ జయంతిని జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. అంటరానితన నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గమని, విద్యాభివృద్ధి ద్వారానే సమాజం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.












