సంగారెడ్డి, 2026-08-15
పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, స్మార్ట్ రేషన్ కార్డులు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో శనివారం ఆయన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదని, అది పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్స్ లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు నిత్యావసర సరుకులు అందించేందుకు రేషన్ షాపులను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు.
సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, అయితే పేదల సంక్షేమం కోసం గతంలో వారు ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని గతంలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు వాస్తవాలను చూడాలని అన్నారు.
రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. సన్నధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్‌కు రూ.500/- బోనస్ అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కార్, శాసన సభ్యులు సంజీవరెడ్డి, నవీన్ యాదవ్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, మాజీ శాసన సభ్యులు జయప్రకాశ్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












