మంచిర్యాల బస్టాండ్‌ను హైటెక్ హంగులతో తీర్చిదిద్దేందుకు బ్లూప్రింట్ సిద్ధమవుతోంది. సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయల మేర ఖర్చుతో ఈ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు ఆర్టీసీ, ప్రభుత్వం సంయుక్తంగా తెలిపాయి. అన్ని వసతులను ఒకే చోట సమకూర్చనున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు.
శనివారం బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కొత్త రూపకల్పనకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 45 సంవత్సరాల కిందట ప్రారంభమైన ఈ బస్టాండ్ తన కళను కోల్పోయిందని, ప్రజల అభిరుచి మేరకు నూతన హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
గోదావరి పుష్కరాలకు నాటికి బస్టాండ్‌ను ప్రారంభానికి సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న 1.5 ఎకరాల స్థలాన్ని 3 ఎకరాలకు పెంచితేనే ఆధునీకరణతో అన్ని హంగులు సమకూర్చవచ్చని, బస్సులు నిలిపే ప్రదేశాన్ని పెంచనున్నట్లు ఆయన చెప్పారు. పూర్తి నమూనాను త్వరలో వెల్లడిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. త్వరలోనే పనులకు శ్రీకారం చుడతామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మధుకర్, సిటీ అధ్యక్షులు నరేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.












