సంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలను పంపిణీ చేశారు.
మంత్రి దామోదర్ రాజనర్సింహ జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు. మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తెలంగాణ దివ్యాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్, హైదరాబాద్, గ్లోబల్ గ్రీన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సంగారెడ్డి సహకారంతో సుమారు రూ.13.10 లక్షల విలువైన బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, బ్యాటరీ ఆటోలను దివ్యాంగులకు అందజేశారు. మొత్తం 21 బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్ల యూనిట్లు, ఒక బ్యాటరీ ఆటోను పంపిణీ చేశారు. ఈ సహాయ పరికరాల పంపిణీ దివ్యాంగులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం, వివిధ సంస్థల సహకారంతో అర్హులైన దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంగీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి, డీఆర్ డీవో పీడీ జ్యోతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












