హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుల కారణంగా ముంపునకు గురైన గుడిపేట పునరావాస కాలనీలో, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన 12 ప్రభుత్వ ప్లాట్లను కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానికులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
ఆందోళనకారులు మాట్లాడుతూ, ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు, ఆర్డీవోకు వినతి పత్రాలు సమర్పించినా అక్రమదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు దక్కాల్సిన ప్లాట్లను ఇతరులు ఆక్రమిస్తుంటే మౌనంగా ఉండటం సరికాదని అధికారులను నిలదీశారు. తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం, తాసిల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేశారు.
తాసిల్దార్ పుష్పలత మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన స్థలం గ్రామపంచాయతీకి అప్పగించిన తర్వాత దాని పూర్తి బాధ్యత గ్రామపంచాయతీదేనని తెలిపారు. ప్లాట్లను ఆక్రమించిన వారిపై నోటీసులు జారీ చేసి విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై మంచిర్యాల కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి నివేదిక సమర్పిస్తామని, అక్రమాలు రుజువైతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించారు.












