పటాన్చెరు, 13 September
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని పటాన్చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పటాన్చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు, రసాయనిక రంగుల కారణంగా నిమజ్జనం సమయంలో నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రకృతిని పరిరక్షించవచ్చని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడటం అంటే భవిష్యత్ తరాల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను కాపాడటమేనని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో మట్టి వినాయకుడిని ప్రోత్సహించి, పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. “మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.












