సంగారెడ్డి, 10 September
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి రాత్రి వేళల్లో నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్ మార్గాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సాయంత్రం 7:30 తర్వాత బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు బస్టాండుల్లోనే నిరీక్షించాల్సి వస్తోంది.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి రాత్రి వేళలో నర్సాపూర్, తూప్రాన, గజ్వేల్ మార్గంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సంగారెడ్డి నుంచి చివరి బస్సు సాయంత్రం 7:30గంటలకు వెళ్లిపోవడంతో ఆ తర్వాత బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు బస్టాండులోనే నిరీక్షించాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో 7:30 తర్వాత బస్సు లేకపోవడంతో ఇస్మాయిల్ఖాన్ పేట, గుండ్లమాచునూర్, పల్పనూర్, బోర్పట్ల, దౌల్తాబాద్, హత్నూర, నర్సాపూర్, తూప్రాన, గజ్వేల్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆందోళన చెందారు. బోర్పట్ల, పల్పనూర్, గుండ్లమాచునూర్, దౌల్తాబాద్ ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలకు రాత్రి 10గంటల షిప్టులకు వెళ్లే అనేక కార్మికులు ఇక్కట్లకు గురవుతున్నారు. గతంలో రాత్రి 9గంటలకు సంగారెడ్డి నుంచి నర్సాపూర్ వరకు ఉన్న బస్సును అకారణంగా రద్దు చేయడంతో ఆ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంగారెడ్డి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి రోజు రాత్రి 9గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్సును పునరుద్దరించాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.












